/rtv/media/media_files/2025/07/12/ap-crime-2025-07-12-07-30-26.jpg)
ఏపీలోని ధర్మవరంలోని ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విశ్వనాథ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మామే అల్లుడిని రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథ్ తన అత్త, మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అత్తకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు అమ్మేశాడు విశ్వనాథ్ . అయితే ఇటీవల మరో రెండు ఎకరాలు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకొని, స్థిరాస్తి వ్యాపారుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. కొడుకులకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా అమ్మడమేమిటని విశ్వనాథ్‌ను అతని మామ వెంకటరమణప్ప ప్రశ్నించగా విశ్వనాథ్ దారుణంగా అవమానపరిచాడు.
అల్లుడు అడ్డుగా ఉన్నాడని
దీంతో తన కుటుంబానికి అల్లుడు అడ్డుగా ఉన్నాడని భావించి, అతన్ని, ఎలాగైనా తప్పించాలని మామ వెంకటరమణప్ప స్కెచ్ వేశాడు. ప్లాన్ లో భాగంగా తన స్నేహితుడు, గరిశనపల్లికి చెందిన కాటమయ్య ద్వారా ముంకముతక శంకర్ మధ్యవర్తిత్వంతో విశ్వనాథ్‌ను హతమార్చేందుకు రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చాడు. అందుకు గానూ ముందుగానే రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. 2025 జులై1వ తేదీన టమాటా పంట డబ్బు రూ.50 వేలు ఇస్తానని చెప్పి విశ్వనాథ్‌ను కాటమయ్య ముదిగుబ్బకు రప్పించాడు.
విశ్వనాథ్ అక్కడికి వచ్చాక కాటమయ్య, రామకృష్ణ, మధుబాబులు కలిసి అతన్ని వేటకొడవళ్లతో నరికి తల, మొండెం వేరు చేసి పడేశారు. ఈ కేసులో వెంకటరమణప్పతోపాటు బత్తలపల్లి మండలం గరిశనపల్లికి చెందిన కమతం కాటమయ్య, ఎర్రాయపల్లికి చెందిన కమతం రామకృష్ణ, సాకే మధుబాబు, ఓబుళదేవరచెరువు మండలం శెట్టివారిపల్లికి చెందిన మంకముతక శంకర్‌ను రాళ్లఅనంతపురం క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు వేటకొడవళ్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కదిరి కోర్టులో హాజరుపరచగా రిమాండుకు ఆదేశించినట్లుగా డీఎస్పీ తెలిపారు.
ధర్మవరానికి చెందిన విశ్వనాథ్ కు 20 ఏళ్ల కిందట వెంకటరమణప్ప పెద్ద కుమార్తె శ్యామలతో పెళ్లి అయింది. వెంకటరమణప్ప రెండో కుమార్తెపై విశ్వనాథ్ కన్ను పడింది. కొన్నాళ్లకు మరదలితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై ఇంట్లో గొడవలు మొదలవడంతో అటు మామ వెంకటరమణప్ప అత్తకు మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో అల్లుడు విశ్వనాథ్ అక్రమ సంబంధం పెట్టుకున్న మరదలిని, అత్తను తీసుకొచ్చి కదిరిలో ఉంటున్నాడు.