/rtv/media/media_files/2026/03/04/it-job-2026-03-04-13-33-50.jpg)
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో డెల్ సంస్థలో పనిచేసిన సుష్మకు, ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో పెళ్లి అయింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరి ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అత్త కల్పనకు మధ్య తీవ్రంగా గొడవ
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం వంట చేసే విషయంలో సుష్మకు, ఆమె అత్త కల్పనకు మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. సుష్మను తన అత్త వంట గదిలోకి రానివ్వకుండా అడ్డుకునేదని, నిరంతరం ఏదో ఒక సాకుతో వేధింపులకు గురిచేసేదని సుష్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ, ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
సుష్మ మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు సోలదేవనహళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సుష్మ భర్త పునీత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
అయితే, గొడవకు ప్రధాన కారణమని భావిస్తున్న అత్త కల్పన ప్రస్తుతం పరారీలో ఉండటంతో, ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Follow Us