CPI Ramakrishna : రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందే సీఎం జగన్(CM Jagan) ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. 82 మంది సీటింగ్ ఎమ్మెల్యే లను మార్చుతున్నారు.. అసలు 82 మంది ఎమ్మెల్యే లపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్.. సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అందరినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు డమ్మిలేనని ఎద్దెవ చేశారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు(Gundlakamma Project) లో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేసింది శూన్యం అని ధ్వజమెత్తారు. ఋషికొండను గుండు కొట్టించి 450 కోట్లతో ప్యాలెస్ నిర్మించారని విమర్శలు గుప్పించారు. అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. తుపాన్ తో పంటలు నష్టపోతే సీఎం జగన్ స్టేజ్ పైనుంచి పరిశీలించడం దారుణమని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్ అవునన్నా.. కాదన్నా కచ్చితంగా ఓడిపోతారని ఖరకండిగా చెప్పారు. అధికారాలన్నీ జగన్ వద్ద ఉంచుకున్న కనీసం ఒక్క ఎమ్మెల్యే ప్రశ్నించలేదని..ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు గొంతువిప్పాలి ప్రశ్నించాలని సూచించారు.
తెలంగాణ(Telangana) లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా పరిపాలన చేయడంతో ఫలితంగా ఓటమిని చవిచూశారని కామెంట్స్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ కంటే పెద్ద నియంత అని చురకలు వేశారు. 175 మంది ఎమ్మెల్యేలను మార్చిన సీఎం జగన్ ఎట్టి పరస్థితిలోనూ గెలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని..జగన్ కు న్యాయస్థానాలంటే లెక్కలేదని దుయ్యబట్టారు. జగన్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యనించారు.
Also Read: ఎమ్మెల్సీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం.!
అమరావతి రాజధాని కాదు విశాఖ నే రాజధాని అని జగన్ కచ్చితంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు విశాఖను అభివృద్ధి చేయాలని ఉద్దేశం లేదని.. కేవలం దోచుకోవడమే ప్రధాన ఉద్దేశమని నిప్పులు చెరిగారు. విశాఖ రాజధాని కేవలం జగన్ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అని అన్నారు. రుషికొండ నిర్మాణాలలో 150 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా రుషికొండ నిర్మాణాలపై విచారణ జరిపిస్తుందని అన్నారు.
"కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్ ను ఇంటికి పంపించాలి"..ఇదే మా ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు సీపీఐ రామకృష్ణ. వీటి కోసం ఏ పార్టీ ముందుకు వచ్చిన కలుపుకొని వెళ్తామని తెలిపారు. ఈ నెల 16,17 తేదీలలో సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం భువనేశ్వర్ లో జరగనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పొత్తులపై చర్చిస్తామని పేర్కొన్నారు.