CM Chandrababu: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మంగళగరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినతులు అన్నింటిని పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు.
రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం..
వైసీపీ ప్రభుత్వం రికార్డులను కూడా తారుమారు చేసిందని ఆరోపించారు. దాని కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందన్నారు.రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తాం. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతాం. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తాం. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నా పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా మార్పులు తెస్తాం. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.