ఒకేసారి ముగ్గురిని కత్తితో పొడిచిన సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. సోషల్ మీడియాలో తమ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ముగ్గురు వ్యక్తులపై ఓ కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది కలిసి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తొగించావని ప్రశ్నించిన పాపానికి విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దారుణమైన ఘటన ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ మేరకు స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామ సమాచారం చేరవేసుకునేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో జావిద్, అహ్మద్, రజాక్, భీమ్‌దాస్ అనే నలుగురు యువకులు ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ముగ్గురు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతున్నారని భావించిన కాంగ్రెస్ గ్రామా అధ్యక్షుడు భీమ్‌దాస్ .. గ్రూప్ నుంచి వారిని తొలగించాడు. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కనిపించిన భీమ్‌దాస్‌ను గ్రూప్ నుంచి ఎందుకు తొలగించావని సదరు వ్యక్తులు ప్రశ్నించారు. మాటమాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. భీమ్‌దాస్ అప్పటికే జేబులో దాచుకున్న కత్తిని తీసి ఆ ముగ్గురిపై దాడిచేశాడు. విచక్షణారహితంగా పొడవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన గ్రామస్థులు క్షతగాత్రులను తొలుత బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఛాతిపై గాయాలైన హైమద్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయనను నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. మిగిలిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read also :భారత్ గెలిస్తే బట్టలు లేకుండా పరిగెత్తుతా.. ప్రముఖ నటి సంచలన ప్రకటన
ఇక దాడికి పాల్పడిన భీమ్‌దాస్‌ను కొంతమంది చితకబాదారు. ఇక దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జాజాల సురేంద.. ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు హింసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలో మదన్‌మోహన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ దవాఖానలో బాధితులను పరామర్శించిన ఆయన మదన్‌మోహన్‌తోపాటు అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.