Ex MLA P Vishnuvardhan Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో నేతల అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్(Congress) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu Vardhan Reddy) అనుచరులు వీరంగం సృష్టించారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. ఇటుకలు, రాళ్లు రువ్వి నానా బీభత్సం సృష్టించారు. బంజారాహిల్స్ టికెట్‌ను విష్ణువర్ధన్ రెడ్డికి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌కు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రేవంత్ రెడ్డి ప్లెక్సీలను చించేశారు.
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. జూబ్లీహిల్స్‌పైనే విష్ణు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్‌కు కేటాయించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి. తనకు టికెట్ దక్కకపోవడంపై కొంచెం ఘాటుగానే స్పందించారు. తాను చాలా రోజులుగా జూబ్లీహిల్స్‌లో ఇంటింటి ప్రచారం చేస్తున్నానని అన్నారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్ ఓట్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో కేవలం ఒక కమ్యూనిటీ కోసం టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. ఒకే ఇంట్లో రెండు టికెట్స్ ఇవ్వమనే వాదన నిజమైతే.. దానికి విరుద్ధంగా ఎంతో మందికి ఇచ్చారని గుర్తు చేశారు విష్ణు. హైదరాబాద్‌లో పీజేఆర్ లాంటి నాయకుడి కుటుంబానికి టికెట్ ఇస్తే తప్పేంటని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. తాను కచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు.
ఇకపోతే.. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. ఆయన మాత్రం దాదాపు పార్టీ మారే ఉద్దేశ్యంతోనే ఉన్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా? బీజేపీలో చేరుతారా? అనే విషయంలో క్లారిటీ రావాలంటే ఒకటి రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read:
‘కళ్లు తెరిపిద్దాం’.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం..