Jagga Reddy Delhi Tour: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి (Delhi) వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో జగ్గారెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. నిన్న (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయిన జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీతో (Congress Party) పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టనునట్లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు గుసగుసలు పెడుతారట.
ALSO READ: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్
ఎమ్మెల్సీ టికెట్..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) సంగారెడ్డి (Sangareddy) నుంచి ఎమ్మెల్యే అభ్యర్తిగా బరిలో దిగిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. ఓడిపోయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే.. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆయన సీఎం రేవంత్ రెడ్డి కలిశారని తెలుస్తోంది.
ఎంపీగా జగ్గారెడ్డి కుమార్తె..
మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలు ఎంపీ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ విజయడంకా మోగించాలని యోచనలో ఉంది. అయితే.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం మెదక్ ఎంపీ టికెట్ కొరకు పట్టుబట్టినట్లు సమాచారం. మెదక్ ఎంపీగా తన కుమార్తె జయారెడ్డి లేదా సతీమణికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్..
ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యేగా డిప్రమోట్ అయిన జగ్గారెడ్డి మరోసారి పవర్ లో ఉండేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి కాంగ్రెస్ హైకమాండ్ జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ, ఎంపీ, పీసీసీ పదవి వీటిలో ఏది ఇస్తుందో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.