Double Decker Corridor in Hyderabad : జాతీయ రహదారి 44(National Highway 44) పై ప్యారడైజ్ జంక్షన్(Paradise Junction) నుంచి తాడ్‌బండ్, బోవెన్‌పల్లి జంక్షన్‌ల మీదుగా మిలటరీ డెయిరీ ఫాం వరకు 5.3 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రూ.1,580 కోట్లతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అదే ఎలివేటెడ్ కారిడార్‌లో మెట్రో రైలు(Metro Rail) మార్గాన్ని నిర్మించాలని చూస్తున్నారు. అందుకే దీన్నీ డబుల్ డెక్కర్ కారిడార్(Double Decker Corridor) గా పిలుస్తున్నారు. కండ్లకోయలో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 5.3 కిలోమీటర్ల నిర్మాణంలో, 4.6 కిలోమీటర్లను ఎలివేట్ చేస్తారు. 0.6 కిలోమీటర్లు సొరంగంగా ఉంటుంది. ఆరు లేన్ల కారిడార్‌లో 131 పిల్లర్లు ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా బోవెన్‌పల్లి జంక్షన్‌కు సమీపంలో నిర్మాణానికి ఇరువైపులా రెండు ర్యాంపులు కూడా నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తికాగానే మెట్రో రైలు మార్గం పనులు చేపడతారు.
హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా ప్రయాణించే NH-44 కారిడార్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, కామారెడ్డి, ఆదిలాబాద్ మార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించింది. కానీ రక్షణ భూముల కేటాయింపులో జాప్యం కారణంగా పనులు చేపట్టలేదు. ఈ ఏడాది జనవరి 5న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు రక్షణ భూములను కూడా కేటాయించాలని సీఎం కోరారు. దీని ప్రకారం మార్చి 1న రక్షణ శాఖ భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలివేటెడ్ కారిడార్ వివరాలు:
–> మొత్తం కారిడార్ పొడవు: 5.3 కి.మీ
–> ఎలివేటెడ్ భాగం: 4.6
–> భూగర్భ సొరంగం: 0.6 కి.మీ
–> పీర్స్: 131
–> మొత్తం భూమి అవసరం: 73.16 ఎకరాలు
–> రక్షణ భూములు: 55.85 ఎకరాలు
–> ప్రైవేట్ భూములు: 8.41 ఎకరాలు
–> సొరంగం కోసం భూమి: 8.90 ఎకరాలు
Also Read: ఆస్ట్రేలియాలో లోయపడి తెలుగు వైద్యురాలు మృతి!