CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గురువారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో, సిద్దిపేటలో నిర్వహించిన జన జాతర సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌లో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు పోవడం ఖాయమని అన్నారు. కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలమని పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని, అందుకే నాపై కేసులు పెట్టారని అన్నారు.
ALSO READ: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం
మోడీ కేసులకు భయపడతానా?
కేసీఆర్ 200 కేసులు పెడితేనే భయపడలేదని, ఇప్పుడు మోడీ కేసులకు భయపడతానా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీ సుల్తానులు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని వారి ఆటలు సాగవు అన్నారు. బీజేపీ రిజర్వేషన్లు తీసివేస్తుందనడానికి సాక్షాలు ఉన్నాయన్నారు. 1881 నుండి దేశంలో జనగణన జరుగుతుందని, 2021లో బీజేపీ ఆ పని చేయలేదన్నారు. దీనికి కారణం జనగణనతో పాటు కులగనన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడమేనన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అదే జరిగితే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని బీజేపీ అభిప్రాయం అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో తీసుకువస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ జైల్లో పెట్టాడని, ఇప్పుడు మోడీ ఆ ప్రయత్నం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.