Thummala vs Sharmila: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. 119 నియోజకవర్గాలకు పోటీ కోసం 1000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైపోయింది. ఇటీవల ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం లాంఛనమైంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఇది వరకే పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరనుండటంతో పోటీ మరింత తీవ్రతరం అయింది. ఈసారి ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం తుమ్మలను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మల తన అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మెజార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచించారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మలతో భేటీ అయి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో ఆయన ఈనెల 6న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అయితే పాలేరు నుంచి పోటీ చేస్తానని మాత్రం ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేవలం ప్రజాక్షేత్రంలో మాత్రమే ఉంటానని తెలిపారు. అయితే పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. దీంతో పాలేరు నియోజకవర్గంపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.
షర్మిల నాన్-లోకల్ అని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పాలేరు నుంచి తుమ్మలకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆరు నూరైనా పాలేరు బరిలో షర్మిల ఉంటారని వైటీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పాలేరులో షర్మిల వ్యక్తిగత కార్యాలయం ఏర్పాటుచేస్తున్నారు. బరిలో ఎవరు నిలిచినా ఓడిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. పాలేరు బరీలో ఎవరుంటారనేది అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్