Varanasi Title: "వారణాసి" టైటిల్ వార్..! రాజమౌళిపై ఆ నిర్మాత ఫిర్యాదు.

రాజమౌళి “వారణాసి” టైటిల్ గ్లింప్స్ తర్వాత భారీ హైప్ తెచ్చుకున్నా, వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. రాజమౌళి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలతో హిందూ సంస్థలు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు “వారణాసి” టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయిందంటూ మరో నిర్మాత వివాదం సృష్టించాడు.

New Update
Varanasi Title

Varanasi Title

Varanasi Title: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli) తీస్తున్న భారీ చిత్రం “వారణాసి” విడుదలకాకముందే వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. మహేష్ బాబు(Mahesh Babu), ప్రియాంకా చోప్రా(Priyanka Chopra), పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉంది. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌ను రాజమౌళి అద్భుతంగా ప్లాన్ చేసి భారీగా నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్‌లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యగా మారాయి.

ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన “నేను దేవుళ్లను నమ్మను” అన్న కామెంట్ హిందూ సంస్థల కోపానికి గురైంది. రాష్ట్రీయ వానరసేన, మరికొన్ని హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించి సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుతో రాజమౌళిపై కేసు నమోదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడీ వివాదం తగ్గకముందే మరో సమస్య తలెత్తింది. అదే “వారణాసి” టైటిల్ వివాదం. రాజమౌళి టైటిల్ రివీల్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కానీ ఈ టైటిల్ మరో నిర్మాణ సంస్థ అయిన రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ వద్ద ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందని తెలిసింది. నిర్మాత సి.హెచ్. సుబ్బారెడ్డి ఈ టైటిల్‌ను 2023లో రిజిస్టర్ చేసుకున్నారు, 2026 వరకూ రీన్యూ కూడా చేశారు.

రాజమౌళి టీమ్ “Varanasi” అనే స్పెల్లింగ్‌తో టైటల్ ప్రకటించగా, సుబ్బారెడ్డి “Vaaranasi” అనే స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేశారు. అయితే ఉచ్చారణ ఒకటే కావడంతో టైటిల్ హక్కులపై గందరగోళం నెలకొంది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌కి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసినా, అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు.

రెండు పక్షాలు టైటిల్‌పై తమ హక్కులు ఉన్నాయని చెబుతున్నందున ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. రాజమౌళి, నిర్మాత కార్తికేయ సుబ్బారెడ్డితో చర్చ జరిపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. లేకపోతే ఈ విషయం లీగల్‌గా వెళ్లే అవకాశమూ ఉంది.

ఒకవైపు విలన్ థీమ్, గ్లింప్స్‌పై వచ్చిన భారీ స్పందన, మరోవైపు రాజమౌళి కామెంట్స్ వివాదం, ఇప్పుడు టైటిల్ సమస్య… ఇలా వారణాసి విడుదలకముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

మొత్తం మీద, “వారణాసి”పై పెరిగిన హైప్‌తో పాటు వివాదాలు కూడా కొనసాగుతుండటం ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Advertisment
తాజా కథనాలు