/rtv/media/media_files/2025/09/22/ed-2025-09-22-15-37-54.jpg)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఆమెపై దాఖలు చేసిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణ కొనసాగాల్సిందేనని, న్యాయస్థానంలో అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
#SupremeCourt hears plea of Bollywood actress Jacqueline Fernandez seeking quashing of the Rs. 200 crores money laundering case involving alleged conman Sukesh Chandrasekhar.
— Live Law (@LiveLawIndia) September 22, 2025
Bench: Justices Dipankar Datta and AG Masih pic.twitter.com/SG5oJeeWli
కేసు వివరాలు:
గతంలో సుఖేష్ చంద్రశేఖర్ అనే ఆర్థిక నేరగాడి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.7.2 కోట్ల విలువైన బహుమతులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ బహుమతులు అక్రమ మార్గాల ద్వారా సంపాదించినవేనని, ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ కూడా నిందితురాలిగా ఉందని ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ ఆరోపణలను జాక్వెలిన్ తీవ్రంగా ఖండించారు. సుఖేష్ క్రిమినల్ బ్యాగ్రౌండ్ తనకు తెలియదని, ఆమె కూడా అతని మోసాలకు బాధితురాలినని వాదించారు. ఈ మేరకు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పు:
గత జూలైలో జాక్వెలిన్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నేరపూరిత ఉద్దేశ్యంపై విచారణ దశలోనే నిర్ణయం తీసుకోగలమని, ఇప్పుడు కేసును కొట్టేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో నిరాశ చెందిన జాక్వెలిన్, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వాదనలను మరోసారి వినిపించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు:
జాక్వెలిన్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "సుఖేష్, జాక్వెలిన్ చాలా సన్నిహితంగా ఉన్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఓ ఫ్రెండ్ మరొకరికి గిఫ్ట్ ఇస్తే, తర్వాత గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నేరంలో భాగమని తేలితే చాలా కష్టం. ఈ దశలో మీ వాదనలను అంగీకరించలేం. విచారణ పూర్తయిన తర్వాతే కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి." అని పేర్కొంది.
చివరికి, ఈ కేసును ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించగా, జాక్వెలిన్ న్యాయవాది అందుకు అంగీకరించారు. దీంతో జాక్వెలిన్‌పై ఈడీ కేసు విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగనుంది. ఈ తీర్పుతో బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు పెద్ద షాక్ తగిలింది.