/rtv/media/media_files/2025/02/05/wDhyef7BUre8m9t7thrh.jpg)
pushpalatha
ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా రంగంలో అగ్ర నటీమణులలో ఒకరిగా నిలిచిన ఈమె.. తెలుగు, కన్నడ, మళయాళ పరిశ్రమలో వందకు పైగా సినిమాలలో నటించారు. పుష్పలత మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పుష్పలత తమిళ సినిమాలోని ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించారు. .
చెరపకురా.. చెడేవు సినిమాతో
ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన చెరపకురా.. చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
1963లో ఎ. వి. ఎం. రాజన్ నటించిన నానుమ్ ఒరు పెన్ చిత్రంలో నటించిన పుష్పలత ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నటుడు రాజన్ తో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి. ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో రెండు జెళ్ల సీత, ఆనంద భైరవి, మాయదారి మరిది, రుణానుబంధం చిత్రాలలో నటించారు.
1970నుండి పుష్పలత క్రమంగా తన సినిమాల్లో నటించడం తగ్గించారు. ఆయన చివరిగా 1999లో శ్రీ భారతి దర్శకత్వం వహించిన పూవాసం చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నటి పుష్పలత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Also Read : ChatGPT:అందుబాటులోకి చాట్ జీపీటీ వాట్సాప్ లో మరో కొత్త సదుపాయం!