Jani Master: పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నిబెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా జానీ మాస్టర్ ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయారని, హైదరాబాద్ లోని తన స్నేహితుల ఇంట్లు తలదాచుకున్నాడు అంటూ ప్రచారాలు జరగగా.. తాజాగా అతన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి. కాగా గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్ ఆరు నెలలు జైలులో ఉన్నాడు.
మహిళా కమిషన్‌లోనూ..
మహిళా కమిషన్‌లోనూ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని.. ఈ విషయాన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె బాధితురాలికి హామీ ఇచ్చారు.
పలు సెక్షన్ల కింద..
జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీ పై లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు
అయితే జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడఖ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలు పెట్టాయి. తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.