అక్క కూడా తమ్ముని బాటలోనే ప్రయాణిస్తున్నారు. సేవా రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తమ్ముని లాగే దూసుకు పోతున్నారు. స్వల్ప కాలంలోనే వైసీపీ కీలక నేతగా ఎదుగుతున్నారు. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేస్తానంటున్నారు. ఏకంగా బాలయ్యబాబుకు సవాల్ విసురుతున్నారు. దీంతో హిందూపురంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇంతకు ఆ మహిళా నేత ఎవరు...తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ.... !
చౌలూరు రామకృష్ణారెడ్డి... ఆయనది కెనడాలో బాగా స్థిర పడిన కుటుంబం. కావాలనుకుంటే ఆయన అక్కడే లగ్జరీ లైఫ్ గడపవచ్చు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదు. పుట్టిన ఊరికి ఏదో ఒక రూపంలో మంచి చేయాలనుకున్నాడు. వైసీపీలో చేరి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. అందరూ ఎదగాలని చూశాడు.. కానీ తన ఎదుగుదులను తన వాళ్లు ఓర్వడం లేదని గుర్తించ లేకపోయాడు.
అందరూ తన వాళ్లే అనుకున్న ఆయన్ని తన పార్టీ నేతలే కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేపింది. చౌలూరు రామకృష్ణారెడ్డి అంత్యక్రియలకు చూసేందుకు ఆయన సోదరి మధుమతి రెడ్డి కెనడా నుంచి వచ్చారు. అక్కడి ప్రజలు చూపించే అభిమానం, ప్రేమ చూసి తట్టుకోలేకపోయారు. తన తమ్ముడి ఆశయాలు ఆగి పోకూడదని నిర్ణయించుకున్నారు.
తన తమ్ముడి ఆశయ సాధన కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అడుగులు వేశారు. వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 10 నెలలుగా వైసీపీ తరఫున పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. హిందూపురంలో ప్రాధాన్యత కల్పిస్తామన్న జగన్ నుంచి వచ్చిన హామీ మేరకు పని చేస్తున్నట్టు ఆమె అంటున్నారు.
హిందూపురంలో బాలయ్యను ఓడిస్తామని ఆమె సవాల్ చేస్తున్నారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా హిందూపురం నియోజకవర్గ ఇంఛార్జ్ గా దీపకు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆమెకు అక్కడ నుంచి ఈ సారి టికెట్ రాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హిందూపురంలో పార్టీ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా వారికి తాను మద్దతు ఇస్తానని చెబుతున్నారు.
ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో ఎప్పుడైనా చట్టసభల్లో కూర్చుంటామని ఆమె అంటున్నారు. తమకు జగన్ నుంచి స్పష్టమైన హామీలు వున్నాయని చెబుతున్నారు. చట్టసభలో చేరి తన సోదరుని ఆశయాల కోసం కృషి చేస్తానని అంటున్నారు. మరి ఆమెకు హిందూపురంలో జగన్ ప్రాధాన్యత ఇస్తారా... లేదా భవిష్యత్ లో ఆమె చట్టసభల్లో కూర్చుంటారా... ఆయన సోదరుని ఆశయాలను నెరెవేరుస్తారా అనే అంశాలను కాలమే నిర్ణయించాలి.