మిచౌంగ్ తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావానికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భారీ వర్షాల వల్ల చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లపైకి వరద వచ్చింది. దీంతో రోడ్డుపై నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెన్నైలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి అక్కడ చాలా ప్రాంతాల్లో వర్షం కురవడం లేదు. ఇది చూస్తుంటే చెన్నై వరద ప్రభావం నుంచి కాస్త బయటడ్డట్లు తెలుస్తోంది.
Also Read: సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఖర్గే
అక్కడ భారీ వర్షాల వల్ల చెన్నై విమానశ్రాయాన్ని మూసివేసి విమాన రాకపోకలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వర్షం ప్రభావం తగ్గిపోవడంతో చెన్నై విమానశ్రయాన్ని తెరిచారు. రన్‌వేపై నిలిచి ఉన్న నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించారు. అలాగే తమిళనాడులోని పది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలాఉండగా.. మిచౌంగ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలాప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం జరగడంతో రైతులు వాపోతున్నారు.
Also read: తెలంగాణకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ.. లోక్‌సభలో బిల్లు