పార్లమెంట్‌లో అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. మహువా మొయిత్రా లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేసినట్లు ఆయన సోమవారం ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి అయిన అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్‌లో తన లాగిన్ వివరాలను ఎంపీ మొయిత్రా.. వ్యాపారవేత్త హీరానందనీ అలాగే ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు ఇచ్చినట్లు తెలిసిందని నిషికాంత్ అన్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని.. ఈ ఆరోపణలను నిజమని తేలినట్లైతే ఇది తీవ్రమైన నేరం అవుతుందని పేర్కొన్నారు.
Also Read:స్వలింగ సంపర్కుల వివాహాలపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..
ఇది దేశ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. మహువా మొయిత్రా లోక్‌సభ అకౌంట్ లాగిన్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను చెక్ చేయాలని నిషికాంత్ దుబే లేఖలో డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఆరోపణలపై మొయిత్రా స్పందించారు. ఎంపీల పార్లమెంటరీ పనులను పీఏలు, అసిస్టెంట్లు, ఇంటర్న్‌లతో సహా పెద్ద బృందాలు చూసుకుంటాయని అన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కొన్ని గ్రూప్‌లు, వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మహువా మొయిత్రాను ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేసింది. మరోవైపు మొయిత్రా తనపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో దుబేతో పాటు ఓ న్యాయవాదికి లీగల్ నోటీసులు పంపించారు.