Credit Card - FASTag : మార్చి నెల ఇవాళ్టితో ముగియనుంది. రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(Financial Year) ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి కూడా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డ్, EPFO, ఫాస్టాగ్ లాంటి అనేక మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు నేరుగా సామాన్యుల జేబులపై ప్రభావం చూపుతాయి. అందుకే ఏప్రిల్ 1 నుంచి జరగబోయే ఈ మార్పుల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.
క్రెడిట్ కార్డ్ నియమాలు:
ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నియమాలలో కూడా మార్పులు ఉండబోతున్నాయి. ఇందులో SBI క్రెడిట్ కార్డ్ నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతాయి. కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ ద్వారా ఛార్జీల చెల్లింపుపై ఇకపై రివార్డ్ పాయింట్లు జారీ చేయబడవు. ఈ నియమం ఏప్రిల్ 15, 2024 నుంచి అనేక ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తించవచ్చు.
EPFO నియమాలు:
ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిబంధనలలో పెద్ద మార్పు రానుంది. ఇప్పుడు ఉద్యోగం మారితే, ఉద్యోగి EPFO ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ చేయబడుతుంది. ఇంతకుముందు, ఖాతాదారుల అభ్యర్థనపై మాత్రమే ఖాతాలను బదిలీ చేసేవారు.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ:
ఏప్రిల్ 1లోపు KYCని అప్‌డేట్ చేయాలని NHAI ప్రజలను కోరింది. అలా చేయడంలో విఫలమైతే మీ ఫాస్టాగ్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. దీని తర్వాత మీ ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ మీరు మీ టోల్ చెల్లించలేరు. మీరు ఏప్రిల్ 1లోపు KYCని అప్‌డేట్ చేయడం అవసరం.
గ్యాస్ ధరలు:
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతూ ఉంటాయి. అందుకే ఏప్రిల్ 1న వాణిజ్య, గృహ గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పు ఉండవచ్చు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ధరలు పెరిగే అవకాశాలు చాలా తక్కువ.
Also Read : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?