Remote Workstations in AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. మెగా డీఎస్సీ, ల్యాండ్‌టైట్‌లింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు పెంపు, అన్నాక్యాంటిన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన నైపుణ్య గణన స్కీమ్ నుంచి లబ్ధి పొందే విద్యార్థులతో మాట్లాడారు. మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నామని.. ఇంట్లో పనిచేసుకునే రిమోట్ ఉద్యోగాలు ఉంటే చదవుకుంటూనే పనిచేసుకునేందుకు వీలు ఉంటుందని అన్నారు.
ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇంట్లో గాని లేదా అక్కడికి వెళ్లి పనిచేసుకోవచ్చని.. ఉద్యోగాలు పెంచడమే తమ మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఓ విద్యార్థి చంద్రబాబుని ఇలా ప్రశ్నించారు. 'అందరికి ఐటీ అంటే ఆసక్తి ఉండదు. హోటల్ మేనేజ్‌మెంట్, ఫిల్మ్ మేకింగ్ వంటి ఇతర రంగాల్లో కూడా అవకాశాలు అందుకునేలా యువతను ప్రోత్సహించాలని' అడిగారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ' ఇది చాలామంటి ఆలోచన. ఉదాహరణకు పవన్‌కల్యాణ్‌కు తన అన్నయ్య చిరంజీవి కొంతవరకు నటన నేర్పించారు. ఆ తర్వాత పవన్.. తన స్వయంకృషితో పైకి ఎదిగారు. అందరికీ అలాంటి ఆసరా ఉండదు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి మేము ఆ బాధ్యత తీసుకుంటాం. అవకాశాలు బాగున్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇస్తాం. అలాగే విదేశాల్లో నర్సు ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. అలాంటి రంగాల్లో కూడా ప్రోత్సహిస్తామని' వివరించారు.
మరో విద్యార్థి యువత స్టార్టప్‌లు పెట్టుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని అడిగారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. ' యువతకు సరైన శిక్షణ, చేయుత లోకపోవడం వల్లే స్టార్టప్‌లు విఫలమయ్యాయి. ఇలాంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించి సాయం చేస్తాం. నాణ్యమైన విద్య లభించేలా రాష్ట్రమంతటా ఇంజినీరింగ్ కళాశాలలు పెంచాం. టీడీపీ వల్ల మంచి జరిగిందని భావించిన వారు వేరే చోట ఉన్నప్పటికీ ఏపీకి వచ్చి ఓట్లు వేశారు. దాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేనని' అన్నారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే