TDP Chief Chandrababu: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన వస్తుందని అన్నారు. ఐదేళ్లలో ఏపీని సీఎం జగన్ దివాలా తీయించారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం అని అన్నారు. ఆర్థిక విధ్వసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నట్లు ముఖ్య నేతలతో అన్నారు. ఏపీని పునర్నిర్మించుకునే అవసరం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని.. వారికి అధికారంలోకి రాగానే ముఖ్య పదవులు ఇస్తామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ALSO READ: వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500!
త్వరలో రానున్న క్లారిటీ..
పొత్తులపై క్లారిటీ వచ్చిన ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు చంద్రబాబు. సర్వేల ఆధారంగా ఏ పార్టీ నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చలు జరిపి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇరు పార్టీల నేతలతో సమావేశం అవుతామని అన్నారు. ప్రధాని మోడీ, తాను చాలా ముందు చూపు కలిగిన నాయకులమని చంద్రబాబు అన్నారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలను బీజేపీ, జనసేన పార్టీలకు ఇస్తున్నట్లు ముఖ్య నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
పవన్ కు షాక్..?
ఇటీవల పొత్తులో జనసేన - టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా.. అందులో టీడీపీ 94 మంది, జనసేన 5 మందిని ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో పవన్ కు షాక్ ఇచ్చారు. 3 ఎంపీ స్థానాలను రెండు స్థానాలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకూండా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
17న ఏపీకి మోడీ..?
టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మోడీ పాల్గొనే సభకు ఒకరోజు అటు ఇటు అయినా సభ ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని చంద్రబాబు ముఖ్య నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.