Central Minister Bandi Sanjay: తెలంగాణలో వరదలవల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్ఫష్టం చేశారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాని ఆదేశాలతో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో తాము రాష్ట్ర మంత్రులతో కలిసి ఖమ్మంలో పర్యటించామమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో డోమ్ లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని చెప్పిన బండి సంజయ్... 9 అంతస్తుల సచివాలయంలో 3 అంతస్తుల మేర డోమ్ లను నిర్మించడమేందని ప్రశ్నించారు. అధికారులకు, సిబ్బందికి సరైన స్థలం, సదుపాయాలు కూడా సచివాలయంలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దశమ గ్రహం. తెలంగాణ ప్రజలకు దశమ గ్రహం పీడ విరగడమైంది. అయినా పదేళ్లు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారం అనుభవించింది కదా.. ఇంకా దేనికోసం ఇప్పుడు ఆయన నవగ్రహం యాగం చేస్తున్నారని బండి ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలు, హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు ఏరియల్ సర్వే నిర్వహించామని బండి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాం.. రైతులతో మాట్లాడినం.. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ ను చూశామని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమయ్యామని..వరద నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామని బండి హామీ ఇచ్చారు. ఎన్ని నిధులివ్వాలనే అంశంపై వాస్తవ అంచనాల ఆధారంగా, నిబంధనల మేరకు కేంద్రం కచ్చితంగా సాయం చేస్తామని చెప్పారు.
Also Read: Telangana: తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు–సీఎస్ శాంతికుమారి