ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమస్యల విషయంలో ఓ యువకుడు కుల సంఘం పెద్దల మాట వినలేదనే నెపంతో అతని కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో గ్రామంలో ఎలాంటి శుభకార్యాలకు పిలవకపోవడంతో పాటు తమతో సన్నిహితంగా ఉండేందుకు కూడా స్థానిక ప్రజలు ముందుకు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఇంటిపెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది.
Also read : సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి, డీకే శివకుమార్ సంచలన ప్రకటన
ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన అనగాని రాధాకృష్ణ(28) ఓ విషయంలో జరిగిన పంచాయితీలో కుల సంఘం పెద్దల మాటను ధిక్కరించాడు. ఈ కారణంతో ఇటీవల ఆయన కుటుంబాన్ని బహిష్కరిస్తూ పెద్ద మనసులు పంచాయితీలో తీర్పు వెల్లడించారు. దీంతో స్థానికులు వారిని ఏ శుభకార్యానికీ పిలవడం లేదు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండేందుకు కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాధాకృష్ణ గత నెల 7న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు రాదాకృష్ణను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ అతడు శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రాధాకృష్ణకు భార్య వెంకటలక్ష్మి, రెండు నెలల కుమారుడు ఉన్నారు.