వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు రావడం సహజమే. కొన్ని జంటలైతే కోపంలో ఒకరినొకరు బూతులు కూడా తిట్టుకుంటారు. అయితే ఇటీవల విడాకులు తీసుకున్న ఓ మహిళ.. తన భర్త తిట్టాడని కోర్టులో పిటిషన్ వేసింది. ఆ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త పట్నా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు.. భూతం, పిశాచి వంటి పేర్లతో ఒకరినొకరు దూషించుకోవడం క్రూరత్వంతో సమానం కాదంటూ తెలిపింది.
Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు..
కారు కావాలని డిమాండ్
ఇక వివరాల్లోకి వెళ్తే.. 1993లో బిహార్‌లోని నవాదాకు చెందిన ఓ మహిళకు ఝూర్ఖండ్‌కు చెందిన నరేశ్ గుప్తాతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత అదనపు కట్నం కింద కారు కొనివ్వాలంటూ డిమాండ్ చేస్తూ.. తనను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె 1994లో తన భర్తతో సహా మామ సహదేవ్ గుప్తాపై ఆమె కేసు పెట్టారు. దీంతో 2008లో ఆ ఇద్దరికి కోర్టు ఏడాది పాటు కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత వాళ్లు అదనపు సెషన్స్ కోర్టుకు వెళ్లారు. పదేళ్ల తర్వాత ఆ అప్పీల్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత దీన్ని సవాలు చేస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఈ జంటకు ఝార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఇది క్రూరత్వం కాదు
అయితే తాజాగా గతంలో ఆమె మాజీ భర్త వేసిన పిటిషన్‌పై పట్నా హైకోర్టులో విచారణ జరిగింది. వారు దాఖల చేసుకున్న పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. విడాకులు తీసుకున్న మహిళ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ మహిళను అత్తింటి వాళ్లు భూతం, పిశాచి అంటూ దూషించారని.. ఇది క్రూరత్వం కిందే వస్తుందని అన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ బిబేక్ చౌధురి ఆధ్వర్యంలో ఏకసభ్య ధర్మాసనం.. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు ఉంటాయని పేర్కొంది. ఇలాంటివి క్రూరత్వం కిందికి రావని తెలిపింది. ఆమె వేధించారని, హింసించారని చెప్పినప్పటికీ.. పిటిషనర్లలో ఎవరిపైనా నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని తెలింది. దీంతో గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
Also Read: ఎవరైనా మీకు తెలిసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? వారిపై ఈసీకి ఇలా కంప్లైంట్ చేయండి!