CAG Report On Double Bed Room Scheme: గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదికలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని వారి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డబుల్ బెడ్రూం పథకంలో నిధులు దారి మళ్లించారని పేర్కొంది. ఈ పథకం అమలు చేయడంలో.. ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. ఈ పథకం కోసం తీసుకున్న రుణ మొత్తాన్ని కొంత కాలం పాటు నిర్థకంగా డిపాజిట్లలో గత ప్రభుత్వం ఉంచిందని తెలిపింది. నిధులను ఇతర పథకాలకు, సంస్థలకు గత ప్రభుత్వం దారి మళ్లించినట్లు చెప్పింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సంబంధం లేని ఇతర రుణాలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని నివేదికలో పేర్కొంది.
ALSO READ: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇసుకలోనూ తగ్గలే..
గత ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలపై కాగ్ నివేదిక మొట్టికాయలు వేసింది. గత ప్రభుత్వం పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చిందని పేర్కొంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని తెలిపింది. ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమైందని పేర్కొంది. ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని వెల్లడించింది. గత ప్రభుత్వం అధిక లాభం కోసం అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం వాటిల్లేలా చేసిందని పేర్కొంది. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదని తెలిపింది. అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగిందని నివేదికలో వెల్లడించింది. పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.
ఆసరా పెన్షన్లలో అవినీతి..
ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీలో గోల్‌మాల్ జరిగిందంటూ తేల్చి చెప్పింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య కాగ్ ఆడిట్ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు అని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంది. వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతా ఉందని.. సెర్ప్ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు నివేదిక ఇచ్చారు. 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి పింఛన్ల చెల్లింపు జరగలేదని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా గత ప్రభుత్వం పింఛన్లు జారీ చేసిందని పేర్కొంది.
DO WATCH: