/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
stock market today
చాలా ఏళ్ల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం సులభతరం కావడమే కాకుండా వినియోగదారులకు అనేక విదేశీ వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. భారత్ తో ఈయూ ఒప్పందం స్టాక్ మార్కెట్ కు కలిసి వచ్చింది. చాలా రోజుల నుంచీ నష్టాల్లో ఈదులాడుతున్న సూచీలు ఈ రోజు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా అమెరికా వాణిజ్య ఒప్పందం, సుంకాల భయం కొంత తీరిందనే చెప్పాలి. ఈయూ ఒప్పందంతో ఇప్పటి వరకు తమ షేర్లను అమ్మేసుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు మళ్ళీ వెనక్కు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డల్ గా మొదలై...జోష్ లోకి..
ఎప్పటిలాగే మార్కెట్ ఈరోజు ఫ్లాట్ గానే మొదలైంది. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ దాని రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు 650 పాయింట్లు పడిపోయింది, మరియు నిఫ్టీ కూడా దాని రోజు గరిష్ట స్థాయి నుండి 185 పాయింట్లు పడిపోయింది. అయితే ఈయూ ఒప్పదం ఖరారు అయిందని తెలిసిన తర్వాత మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ రెండు ఒక్కసారిగా ఎగిశాయి. చివరకు రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 82,503 గరిష్ట స్థాయిని, నిఫ్టీ 25,372 గరిష్ట స్థాయిని తాకింది.
30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 22 పెరగ్గా.. 8 పడిపోయాయి. BEL, జొమాటో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 9% వరకు పెరిగాయి. అయితే ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మా షేర్లు మాత్రం 4% వరకు పడిపోయాయి. మొత్తానికి చమురు, గ్యాస్ రంగం అత్యధికంగా 3.4% లాభపడింది. ఆర్థిక సేవలు, ఆటో, ఐటీ, మీడియా, లోహాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ రంగాలు కూడా 2.5% వరకు లాభపడ్డాయి.
ప్రపంచ మార్కెట్లలో కూడా బూమ్..
భారత మార్కెట్ తో పాటూ ప్రపంచ మార్కెట్లు కూడా ఈరోజు లాభాలను చూశాయి. ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 1.69% పెరిగి 5,170 వద్ద, జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.047% పెరిగి 53,358 వద్ద ముగిశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 2.58% పెరిగి 27,826 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.27% పెరిగి 4,151 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 27న డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.83% తగ్గి 49,003 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.91% లాభపడింది.. S&P 500 0.41% పెరిగింది.
Follow Us