అందరూ వేరు.. రతన్ టాటా వేరు.. పారిశ్రమికవేత్తలంటే కరప్షన్ ఛార్జస్ నుంచి ఇతర అక్రమాల వరకు చేసేవారిగా ప్రజలకు అనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాను అనాధికారికంగా నడిస్తున్నది, పాలిస్తున్నది కార్పొరేట్ కంపెనీలే.. అయితే ఇదంతా మిగిలిన వారి మేటర్.. రతన్ టాటా రూటు మాత్రం సపరేటు.. ఆయన అజాతశత్రువు..! ఆయన్ని ద్వేషించేవారు అసలు కనిపించరు.. విమర్శించేవారు కూడా చాలా రేర్‌గా కనిపిస్తారు. రతన్ టాటాకు ఇచ్చే గౌరవం కూడా ఇతర పారిశ్రమికవేత్తలకు ఇవ్వరు..! ఇంతకీ రతన్‌కు.. ఇతర పారిశ్రమికవేత్తలకు ఉన్న తేడా ఏంటి? ఆయనకు సపరేటు బ్రాండ్ ఎందుకొచ్చింది?
అత్యంత పురాతనమైన గ్రూప్..
భారత్‌లో అత్యంత పురాతనమైన గ్రూప్ అయినప్పటికీ, ఇతర వ్యాపార దిగ్గజాలతో పోలిస్తే టాటా గ్రూప్ నికర విలువ ఎందుకు తక్కువగా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా..? ప్రముఖ వార్త సంస్థ నెట్‌వర్క్18 నివేదికల ప్రకారం టాటా సన్స్ తన మొత్తం సంపాదనలో దాదాపు 66శాతం ట్రస్టుల ద్వారా దాతృత్వ కార్యకలాపాలకు కేటాయిస్తుంది. రతన్ టాటా తన కంపెనీల ఆదాయాలను తన వ్యక్తిగత సంపద వైపు కాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా దేశం, దాని పౌరుల అభివృద్ధి వైపు మళ్ళిస్తారు. దాతృత్వం పట్ల ఉన్న ఈ నిబద్ధత వల్ల ఇతర సంస్థలతో పోల్చితే టాటా గ్రూప్‌కు ఉన్న అపార సంపద కాస్త తక్కువగానే చెప్పాలి.
ఆధిపత్యం ఉన్నా.. ఆస్తుల్లో మాత్రం వెనుకే..
మీరు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలను పరిశీలిస్తే ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో రతన్ టాటా ఎప్పుడూ ఉండరు. నిజానికి టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తన ప్రొడక్ట్స్ ద్వారా పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించిన రోజులు కూడా ఉన్నాయి. అయిన్నప్పటికీ భారత్‌లోని ఇతర ప్రముఖ పారిశ్రమికవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి వ్యాపార దిగ్గజాలతో పోలిస్తే రతన్ టాటా సంపద చాలా తక్కువ. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం, టాటా నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు.
421వ స్థానం
దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో టాటాది 421వ స్థానం. ఈ జాబితా ఆయన దాతృత్వం ఎంత పెద్దదో వివరిస్తుంది. మరో విషయం ఏంటంటే ఆయన దుబారాకు దూరంగా ఉంటారు. నిరాడంబరమైన జీవన విధానాన్ని పాటిస్తారు. వెరి సింపుల్‌గా ఓ బ్లూ షర్ట్ ధరిస్తారు. బయటకు ఎప్పుడు వెళ్లినా అదే హూందాతనాన్ని పాటిస్తారు. ఆయనది పూర్తిగా డౌన్-టు-ఎర్త్ వ్యక్తిత్వం. అందుకే ఆయనంటే అందరికి ఇష్టం.
టాటా కారు విఫలమా?
వ్యాపారం లక్ష్యం కేవలం లాభాలను ఆర్జించడమే కాదు. పారిశ్రమికవేత్తలకు ప్రజల పట్ల సేవాతత్పరత కూడా ఉండాలి. రతన్ టాటా ఇదే ఫాలో అయ్యారు. కానీ మరే ఇతర వ్యాపారవేత్త కూడా టాటా నుంచి ఏమీ నేర్చుకోలేదన్నది చాలా మంది అభిప్రాయం. టాటా నానో కారు విఫలమైందని చాలా మంది చెబుతారు కానీ అది నిజం కాదు.. ఈ కారు వెనుక ఉన్న ఆయన ఆలోచన అద్భుతమైనది. వర్షంలో తడుస్తున్న కుటుంబాన్ని చూసి టాటాకు ఈ టాటా నానో ఐడియా వచ్చింది. ఇలా ఓ మధ్యతరగతి కుటుంబం కోసం ఆలోచించే పారిశ్రమికవేత్తలు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారు నూటికో కోటికో ఉంటారు.. ఈ లిస్ట్‌లో రతన్ టాటా ముందువరుసలో ఉంటారు! అందుకే ఆయన మరణం సామాన్యులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. పారిశ్రమికవేత్తలు చనిపోతే ధనికులే బాధపడతారన్న వాదన నేటితో బ్రేక్ అయ్యిందనే చెప్పాలి!
Also Read : 56 ఏళ్ళ తేడా.. కానీ రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్..అసలెవరీ శాంతను?