తెలంగాణలో పోలింగ్ ముగియగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులంతా గెలుపు తమదేనంటూ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడగా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారన్నారు.
Also read :బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్
ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్ కనిపించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న పింక్ వేవ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అర్థమవుతోంది. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యం అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నామని, ఎమ్మెల్యేలు గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారన్నారు. అలాగే ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని, గత ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందని చెప్పారు. పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమాల గడ్డని, చైతన్యవంతమైన ప్రజలు ఉండడం వల్లే ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు ఉండాలని ప్రజలు నిర్ణయించినట్లు అర్థమవుతోందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని కవిత వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతోపాటు ఎమ్మెల్సీ కవిత కూడా అవిశ్రాంతంగా ప్రచారం చేశారు.