Telangana: మోదీకి రేవంత్ ఇచ్చిన మాట ఇదే.. సంచలన విషయాలు చెప్పిన కేటీఆర్!

సీఎం రేవంత్ త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరుతారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని రేవంత్‌ మోదీతో చెప్పింది వాస్తవమా? కాదా? అనేది చెప్పాలన్నారు.

New Update
Telangana: మోదీకి రేవంత్ ఇచ్చిన మాట ఇదే.. సంచలన విషయాలు చెప్పిన కేటీఆర్!

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ బీజీపీలో విలీనం అవుతుందని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. " ప్రధాని మోదీ అంటే రేవంత్‌కు ఎందుకు భయమో ఈ మధ్యనే తన సన్నిహితులు బయటపెట్టారు. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే ఆయన తన బృందంతో కలిసి బీజేపీలో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా అనేది రేవంత్ చెప్పాలి. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలి. ఒకవైపు ముఖ్యమంత్రి అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన దాడి చేస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి, ప్రభుత్వమేమో ప్రభుత్వ ఆస్తులపై దాడి చేస్తోంది. 47 లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది. రుణ మాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్ చెప్పారు.

Also Read: రోడ్డు ప్రమాదాల నివారణకు GHMC చర్యలు

రూ.31వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించింది. చివరికి రూ.17,000 కోట్లతో రుణమాఫీ అన్నారు. కేవలం 22 లక్షల మందికి మాత్రమే చేశారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం. రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తాం. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతాం. మా కాల్ సెంటర్‌కి దాదాపు లక్షా 20 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఒక ప్రొఫార్మ తయారుచేసి దాని ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తాం. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గాని మాజీ ఎమ్మెల్యే గాని లేదా నాయకులు బాధ్యత తీసుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయి.

Also Read: దమ్ముంటే డేట్, ప్లేస్ చెప్పు.. రేవంత్‌కు హరీష్ రావు మరో సంచలన సవాల్!

కనీసం 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి వంద శాతం రుణమాఫీ పూర్తి అయిందని చెబుతుంటే.. ప్రభుత్వం రుణమాఫీ కానీ వాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టడం వారి డొల్ల వైఖరికి నిదర్శనం. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేయించడం దేనికి నిదర్శనం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం కారణంగా ఫాక్స్ కాన్ ఏమైనా వెనక్కి వెళ్ళిపోయిందా ?. చైనా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం. ఫాక్స్‌కాన్ పెట్టుబడులు, విస్తరణపై ప్రభుత్వం నిజనిజాలు బయటపెట్టాలని'' కేటీఆర్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు