తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారని.. కానీ ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయంటూ జనాలు నాకు చెబుతున్నారంటూ ఆరోపించారు. మంత్రి అజయ్ కుమార్ నాలుగేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఖమ్మంలోని BRSKV TATU అధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. తుమ్మలకు కౌంటర్ వేశారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచింది నువ్వు కాదా అంటూ ఫైర్ అయ్యారు.
తుమ్మల ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన రాజకీయ హత్యలు అన్ని ఇన్ని కావన్నారు . మీ వల్ల కష్టాలు అనుభవించిన వారి ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయంటూ విమర్శించారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన పదవులు అనుభవించి ఆయన్ని మోసం చేసి.. ఆ తర్వాత చంద్రబాబు దగ్గర మంత్రి పదవి పొంది ఆయన్ని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావంటూ ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరావు.. ఏదీ నీ నిజాయతీ, నిబద్ధత అంటూ మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు . ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లకి తెలుసని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారంటూ పేర్కొన్నారు.