ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbham Anil Kumar Reddy) తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. తన ఇంటికి రేవంత్ వస్తున్న విషయాన్ని ఈ ఆడియోలో కుంభం స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరనున్నట్లు కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విభేదాల కారణంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడారు. అయితే.. ఇద్దరి మధ్య తాజాగా సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Politics: బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ టికెట్ ఫిక్స్?
ఇదిలా ఉంటే.. అనిల్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భువనగిరి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రెండు సార్లు నియమితులయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నరని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్ ను వీడి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి కప్పుకున్నారు.
అనిల్ కుమార్ రెడ్డికి భువనగిరి లేదా ఆలేరు నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం దక్కింది. అయితే కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ టికెట్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి తిరిగి హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలో ఈ నెల 30లోగా భారీగా చేరికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.