KCR : మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముకకు గాయమై ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన కేసీఆర్...గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు కేసీఆర్.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10ఏళ్ల పాలనను చేశాం. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది. ఓటమితో నిరాశపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నో సవాళ్లను ఎదుర్కవల్సిందేనన్న కేసీఆర్...ఆపార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితే లేదన్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా? ఉండదా? అనేది వారి చేతుల్లోనే ఉందంటూ కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ సూచించారు. మంచి ఉద్దేశ్యంతో సీఎంను కలిసినా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ట్రాప్ లో నేతలు పడకూడదని వారిని హెచ్చరించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా సిద్ధంగాఉండాలన్నారు.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు అలర్ట్…ఫిబ్రవరి 8న పాఠశాలలకు సెలవు..కారణం ఇదే..!