Visakha Drug Container Issue : విశాఖ పోర్టు లో మార్చిలో సీబీఐ (CBI) పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారం పై వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana). అప్పట్లో ఆ కంటైనర్ తో వైఎస్ఆర్సీపీ (YSRCP) నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ (TDP) తమపై ఆరోపణలు చేసిందని అన్నారు. ఇప్పుడు ఆ డ్రగ్ కంటైనర్ ఎవరిదో కూటమి సభ్యులు పార్లమెంట్ లో ప్రశ్న లేవనెత్తాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ అది డ్రగ్ కాకుంటే దెబ్బతిన్న విశాఖ బ్రాండ్ , ప్రతిష్ట మళ్ళీ నిలబడుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రతిష్ట కోసమే తాను నిష్పక్షపాత విచారణ కోరుతున్నట్లు తెలిపారు. అప్పట్లో ఎన్నికల కోడ్, సీబీఐ విచారణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోయిందని అన్నారు. అలాగే అధికార పార్టీ నేతలు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో అక్రమాలు బయటపెడతామంటూ చెప్తున్నారని అన్నారు.
2014 - 19 మధ్య విశాఖ లో వచ్చిన భూ ఆరోపణలపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఓపెన్ చేయండి, నిజాలు నిగ్గు తేల్చండని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రతిదీ అంటగడుతూ వైఎస్ఆర్సీపీ నేతలపై ఆరోపణలు చేస్తే ప్రజలకు లబ్ధి చేకూరదని అన్నారు. రెడ్ బుక్, ఇంకో బుక్ ఓపెన్ చేసే ముందు విశాఖ భూ దందాపై అప్పట్లో మీ ప్రభుత్వమే వేసిన సిట్ బుక్ ఓపెన్ చేయండని చెప్పారు.
Also Read : పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం