తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీ కూడా 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగనున్నారు. అలాగే గజ్వేల్, హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఈ తొలి జాబితాలో కమలం పార్టీ 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. అలాగే ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో దసరా తర్వాత తెలంగాణలో బీజేపీ అగ్ర నేతలు పర్యటించనున్నారు. ఈ నెల 27, 28, 29,31 తేదీల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు.ఇప్పటికే.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈనెల 27న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 28, 29 తేదీల్లో హిమంత బిస్వా శర్మ, 31న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరోవైపు అమిత్‌షాతో సహా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కలిసి 15కు పైగా సభలు నిర్వహించనున్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలో 5 నుంచి 10 సభల్లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ప్రచారాల్లో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా.. పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ నాలుగు హెలికాప్టర్లను కిరాయికి తీసుకున్నట్లు తెలుస్తోంది.