Hacking: కేటీఆర్‌, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే

మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ విషయంపై వివరణ కొరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Hacking: కేటీఆర్‌, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే

ఇటీవల కొంతమంది విపక్ష నేతల ఐఫోన్లను యాపిల్ సంస్థ నుంచి హ్యాక్ అలర్ట్ మెసేజ్ రావడం రాజకీయ దుమారం రేపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వ్యక్తులు మీ ఫోన్లను హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సందేశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ విపక్ష నేతలు ఆరోపించాయి. ఇలా అలెర్టు మెసేజ్‌ వచ్చిన 20 మంది నేతల్లో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే ఈ విషయంపై వివరణ కొరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఐటీశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం వచ్చే సమావేశంలో ఈ ‘హ్యాక్ అలర్ట్‌’ విషయంపై చర్చించనుందని ఈ కమిటీ సెక్రటేరియట్‌ ఆఫీసు వర్గాలు పేర్కొన్నాయి. స్టాండింగ్‌ కమిటీ దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నాయి. అలాగే ఈ వ్యవహారంపై యాపిల్‌ ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని కమిటీ యోచిస్తున్నట్లు చెప్పాయి.

Also read: బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి సై?

అయితే ఈ అలర్ట్ మెసేజ్‌లపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ.. హ్యాకింగ్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని పేర్కొంది. మరోవైపు అటు యాపిల్ కూడా దీనిపై స్పందించింది. ఈ అలర్ట్ నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని చెప్పింది. ఒక్కోసారి యాపిల్‌ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్‌ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు కూడా కావచ్చేమోనని తెలిపింది. ఇదిలా ఉండగా.. విపక్ష నేతలు చేసిన హ్యాకింగ్ హెచ్చరికల ఆరోపణలను కేంద్రమంత్రి పియూష్ గోయాల్ ఖండించారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని అన్నారు. ఈ విషయంపై వారు ఫిర్యాదు చేయాలని.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం విపక్ష నేతలు బలహీనదశలో ఉన్నాయని.. అందుకే ఆ పార్టీ నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దాదాపు 150 దేశాల్లోని కొంతమందికి ఇలా సందేశం వచ్చిందని యాపిల్ సంస్థే చెప్పిందని.. దీన్ని బట్టి చూస్తే హ్యాకర్లు చురుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

మరో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ కూడా ఈ వ్యవహారంపై ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో స్పందించారు. విపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చి.. ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లపై యాపిల్ సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. యాపిల్ సంస్థ పదేపదే తమ ఉత్పత్తులు భద్రమైనవని చెబుతుంటాయని.. అవి నిజంగా భద్రమైమనవే అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఎందుకు ఇవ్వాల్సి ఉంటుందని ప్రశ్నించారు. ఈ విషయంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ దర్యాప్తులో యాపిల్ సంస్థ కూడా చేరాలంటూ పేర్కొన్నారు. ఇదిలాఉండగా తమ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వారి ద్వారా ప్రయత్నం జరిగినట్లు అలర్ట్‌ సందేశాలు వచ్చాయని మంగళవారం విపక్ష ఎంపీలు మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, శశిథరూర్ తదితరులు ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు