మాజీ ఎంపీ , బీజేపీ ముఖ్య నేత విజయ శాంతి (Vijayasanthi) తన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం(Political Journey) గురించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా (Social media)వేదికగా పంచుకున్నారు. తన రాజకీయ జీవితంలో..ప్రయాణంలో ఏనాడూ కూడా ఏ పదవీ కోరుకోలేదని, అయినప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ కూడా తనకి సంఘర్షణ మాత్రమే ఎదురైందని ఆమె ట్వీట్ చేశారు.
'25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్నా... ఇప్పటికీ పదవుల గురించి అనుకోవటం లేదు. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప.. ఇయ్యాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతాం అని కాదు.
Also read: బీజేపీకి వివేక్ రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!
నా పోరాటం నేడు కేసీఆర్ గారి కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయపరంగా విభేదించినప్పటీకి అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా, సగౌరవంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ. హర హర మహాదేవ్. జై తెలంగాణ' అని విజయశాంతి ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేశారు. తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీ పెట్టి ఆ తరువాత దానిని టీఆర్‌ఎస్ లో కలిపేశారు. అనంతరం కేసీఆర్ కి ఆమెకి పొరపచ్చాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఆ పార్టీ పై కూడా ఆమె సంతృప్తిగా లేదు అనే వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ లో జరిగిన మోడీ సభకు ఆమె హాజరు కాకపోవడం ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. కాగా దానికి స్పందనగా ఆమె ''తాను బీజేపీలోనే కొనసాగుతున్నట్లు..కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని'' విజయశాంతి ప్రకటించారు.
అయితే బీజేపీ రెండు జాబితాల్లో కూడా ఆమెకు చోటు దక్కలేదు. రేపు బీజేపీ మూడో జాబితా ప్రకటించేందుకు రెడీ కాగా.. అందులో ఆమె స్థానం ఉంటుందని అంతా భావిస్తున్నారు.