Etela Rajender: సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు.

New Update
Etela Rajender: సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్..

Etela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్‌(Minister KTR)పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ(Telangana) సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ జరుగనుంది. ఈ సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం, మంత్రిపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై గతంలో వారు చేసిన సానుకూల వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఉదహరిస్తూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ పొగిడారని గుర్తు చేశారు. 'ఇప్పుడు తిడుతున్న ఇదే కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రధాని అంటే ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని గురించి చిన్నగా మాట్లాడినప్పుడు దేశ ప్రధాని గౌరవించుకోవాల్సిన సంస్కారం మన మీద ఉంది అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు? ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రధానిని కేటీఆర్ అంటున్నారంటే వీరికి సంస్కారం ఉందా? లేదా? తెలంగాణ ప్రజలు ఆలోచించరా? కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా.. సహకారం లేకుండా.. ఈ రాష్ట్రంలో వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించుకోగలమా?' అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ రాష్ట్రంలో ఉంటే.. కేవలం ఐదారు సంవత్సరాల్లోనే 50 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టి 3,000 కిలోమీటర్ల రోడ్లు వేసిన ఘనత నరేంద్ర మోడిది కాదా? ఇది చెప్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. తెలంగాణ వచ్చేవరకు రూ. 74 వేల కోట్ల అప్పు ఉంటే ఎఫ్ఆర్‌బిఎం రుణాలు, గ్యారెంటీ రుణాల పేరుతో రూ. 6 లక్షల కోట్ల రుణాలు అందించింది మోడీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టులు, ఇస్తున్న సంక్షేమ పథకాలు, వేస్తున్న సోకులు, ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ తీసుకొచ్చిన అప్పులతోనే అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్.

'దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడున్నర కోట్ల ఇళ్లు కడితే.. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఉన్న ప్రధానులకు రాని ఆలోచన తనకే వచ్చిందంటూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ప్రగల్బాలు పలికి, పది లక్షలు కట్టిస్తానని చెప్పి.. 2.91 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. 1,35,000 ఇళ్లు కట్టి.. కేవలం 35 వేల మందికి మాత్రమే పంచిపెట్టారు. పేదల ప్రజల సొంతింటి కలను దూరం చేసిన వ్యక్తి కేసీఆర్. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా నేను భారతీయుణ్ణి అని గల్లా ఎగరేసుకొని చెప్పేలా చేసిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దారు. చంద్రయాన్ ప్రయోగం, G20 సదస్సు ద్వారా దేశ సత్తా చాటారు. ఎక్కడా స్కామ్ లేకుండా.. అపకీర్తి లేకుండా.. శభాష్ అనే విధంగా పాలన సాగిస్తున్నారు. దేశమంతా మెచ్చుకుంటున్న విధానం వీరి కళ్ళకు కనిపించడం లేదా? దేశమంతా మోడీని శభాష్ అంటుంటే.. మళ్ళీ రావాలని కోరుకుంటుంటే.. గుడ్డి ద్వేషంతో.. అసూయతో ఆయన కీర్తిని ఓర్చుకోలేక సంకుచిత భావంతో వీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి.' అని ఈటల అన్నారు.

'తెలంగాణ గడ్డమీద ఏ వర్గం ప్రజలు, ఏ కులం ప్రజలు కూడా కేసీఆర్‌ను మంచి ముఖ్యమంత్రి.. ఇది మంచి ప్రభుత్వం అని అనడం లేదు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన పేదల భూములను, దేవాలయ భూములను, ఎవాక్యుఎటెడ్ భూములను ధరణి తీసుకువచ్చి కబ్జా కాలం తీసివేసి వేల వేల ఎకరాల భూములను వారి బంధుమిత్రులకు, బ్రోకర్లకు అప్పగించి, అక్రమంగా డబ్బులు సంపాదించిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఏం మొహం పెట్టుకొని వస్తావని మోడీని వారు అడుగుతున్నారు. అసలు నువ్వు ఏం మొహం పెట్టుకొని ఇంకా రాష్ట్రాన్ని పాలిస్తావు. పేదల భూములను లాక్కున్నది మీరు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బు సంచులతో తెలంగాణలో ఎన్నికల్లో కొట్లాడాలని చూస్తున్నారు. డబ్బు పెట్టీ, మంద్యం పంచి, నాయకులకు వెలకట్టి.. మళ్లీ గెలవాలని నీచమైన ప్రయత్నం చేస్తుంది మీరు. నరేంద్ర మోడీ చేసిన పనులు మాత్రమే చెప్తున్నారు. మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. నరేంద్ర మోదీకి, కేసీఆర్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీడియాను చేతిలో పట్టుకొని హోల్డింగ్స్ లలో, పేపర్లలో, టీవీలలో హోరెత్తిన అడ్వర్టైజ్మెంట్లతో.. గుజరాత్‌లో, మహారాష్ట్రలో తెలంగాణ చెమట పైసలతో అడ్వటైజ్మెంట్స్ ఇచ్చుకొని చలామణి అవుతున్నారు.' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఈటల.

'తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. సందర్భం రాబోతుంది. 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఆరిపోయే ముందు దీపం వెలిగినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ రాదేమో.. సంక్షేమ పథకాలు రాదేమో.. అని భయానికి మీ పాట పాడుతున్నారు తప్ప ప్రజల గుండెల్లో ప్రజల అంతరంగంలో కేసీఆర్‌ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని ఆరాటపడుతున్న విషయం మీకు తెలియదు. గురివింద నలుపు దానికి తెలియనట్లుగా.. మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. తెలంగాణ ప్రజలు మంచేందో చెడు ఏదో తర్కించుకునేవారు. మంచికి మాత్రమే పట్టడం కడుతారు. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ మహబూబ్ నగర్ రాబోతున్నారు. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి సభను విజయవంతం చేయాలి.' అని తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.

Also Read:

Minister KTR:లోక్‌సభ సీట్లు తగ్గితే ఊరుకునేది లేదు.. లెక్కలు చూపుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్..

Komatireddy Rajagopal Reddy: వారి గడీలు బద్లలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది

Advertisment
తాజా కథనాలు