ఎన్డీయే కూటమి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు కానున్నారు. ఇప్పటివరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.
Also Read: నీట్ పేపర్ లీక్ అయ్యిందా ? అసలేం జరిగిందంటే..
ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన కిషన్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగోసారి ఓడిపోయిన ఆయన.. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. 1977లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు.1980-81లో రంగారెడ్డి జిల్లా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) కన్వీనర్‌గా, 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ BJYM అధ్యక్షుడిగా సేవలు అందించారు.
కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అంబర్‌పేట్ నుంచి 2009, 2014లో కూడా వరుసగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరేళ్లపాటు పనిచేశారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కిషన్‌రెడ్డి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
Also Read: 52 మంది కేంద్ర మంత్రులు వీరే.. పవన్‌కు మోదీ షాక్
ఆ తర్వాత కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా హోదా దక్కించుకున్నారు. మళ్లీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు కూడా ఆయనకు కేంద్రమంత్రి పదవి అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. మరి ఈసారి ఏ మంత్రి పదవి ఇస్తారో అనేదానిపై ఆసక్తి నెలకొంది.