Bangladesh Parliament Dissolved: బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగమ్ ఖలీదా జియాను (Begum Khaleda Zia) జైలు నుంచి విడుదల చేయాలని సైతం ప్రెసిడెంట్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆమె అవినీతి కేసులో జైలులో ఉన్నారు. నిన్న ప్రెసిడెంట్ ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత పార్లమెంట్ ను రద్దు చేసేందుకు ప్రతిపక్ష నేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ను ఈ రోజు రద్దు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కూడా జైలు నుంచి విడులయ్యారు.
బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వానికి ఆమె నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ప్రభుత్వం కూలిపోవడం, ప్రధాని దేశం దాటి పారిపోవడంతో శాంతిభద్రతల సమస్యలు తీవ్రమయ్యాయి. అల్లరిమూకలు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నాయి. హిందువులే టార్గెట్ గా అక్కడ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా (Sheikh Hasina) పార్టీకి చెందిన ఇద్దరు హిందూ కౌన్సిలర్లను ఇప్పటికే ఆందోళనకారులు హత్య చేశారు.
దీంతో పాటు హిందూ కుటుంబాలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇంకా మహిళలపైనా అత్యాచారాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలోనూ అనేక వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఇదే అదనుగా కొందరు ఫేక్, పాత వీడియోలను ఇంటర్ నెట్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఏ వీడియో నిజం, ఏది అబద్ధం అన్న విషయం అర్థం కాని పరిస్థితి నెలకొంది.