Medigadda Barrage: ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram Project) మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటన రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్లి వంతెనను పరిశీలించారు. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పిల్లర్ కుంగిపోయి దెబ్బతినడం వల్ల సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య అక్టోబర్ 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేవేశారు. ప్రస్తుతం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అందుకే బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు.. పెద్ద రేకులను అడ్డంపెట్టి దారిని మూసివేశారు. కేవలం అక్కడి అధికారులు, సిబ్బంది మాత్రమే రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. అలాగే ఏడో బ్లాక్ పరిధిలో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. నీటిని మళ్లించినప్పటికీ కూడా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం వస్తోంది. ఇక ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 61 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు!
మరోవైపు మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ ప్రకారం కట్టలేదని, నిర్వహణలో కూడా లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (Dam Safety Authority) తెలిపింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 11 పిల్లర్లను పునాదుల నుంచి తొలగించి మళ్లీ కొత్తగా కట్టాలని స్పష్టం చేసింది. ఇక మిగతా ఏడు బ్లాకుల్లో కూడా ఇలాగే సమస్య ఉంటే మొత్తం బ్యారేజీనే తొలగించి కొత్తగా నిర్మించాలని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా ఇదే సాంకేతికతో నిర్మించారు. కాబట్టి వాటి పటిష్టతపైనా అధ్యయనం చేయాలని సూచించింది.
Also read:పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!