Karimnagar : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ప్రజాహిత పాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం కరీంనగర్(Karimnagar) లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాహిత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న హోమం వద్దకు వెళ్లి కంకణం కట్టుకున్నారు. అలాగే తన నివాసానికి వెళ్లి మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చనలు పూర్తయిన తర్వాత మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ యాత్రకు వెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేర బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన పాదయాత్ర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజాహితమే లక్ష్యంగా..
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పొడవునా ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా... కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 20 నుండి మలి విడత యాత్రకు చేపట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్(Bandi Sanjay) యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి : AP: ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ప్రజలకు వివరిస్తా..
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండిసంజయ్ తెలిపారు.