పసిఫిక్ దేశమైన పపువా న్యూ గినియాలో ఘోర విపత్తు సంభవించింది. మారుమూల ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మేర్స్బీకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఎన్గా ప్రావిన్స్‌లో కావోకలం అనే గ్రామ ఉంది. ఇక్కడే అకస్మాత్తుగా ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఆ గ్రామంపై పడ్డాయి.
Also Read: ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డున తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి..
దీంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు బయటకు తీస్తున్నారు. ఇప్పటిదాకా 100కు పైగా మృతదేహాలను బయటికి తీశామని మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ మారుమూల గ్రామానికి ఇంకా పోలీసులు, రెస్క్యూ టీం చేరుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా పపువా న్యూ గినియా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.