ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఆయన అరెస్టును విపక్ష పార్టీలు ఖండిచాయి. అయితే తాజాగా కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. తన భర్తను అరెస్టు చేయడంపై ప్రధాని మోదీపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ' మీరు మూడుసార్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అధికార దురాహంకారంతో మోడీజీ అరెస్టు చేశారు. ఆయన అందరిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా జరగడం ఢిల్లీ ప్రజలను మోసం చేయడమే. మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికీ మీతోనే ఉంటారు. ఆయన జైల్లో ఉన్నా.. బయట ఉన్నా తన జీవితం ఈ దేశానికే అంకితం. ఆయన ప్రజలకు సాయం చేసేవారని అందరికీ తెలుసు. జై హింద్' అంటూ సునీతా కేజ్రీవాల్ రాసుకొచ్చారు.
సునీతా కేజ్రీవాల్ ఎవరు
సునీతా కేజ్రీవాల్.. 1993 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఆర్‌ఎస్(IRS) అధికారి. భోపాల్‌లోని శిక్షణ తీసుకుంటున్న సమయంలో.. 1995 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారైన అరవింద్ కేజ్రీవాల్‌తో ఆమెకు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. చివరికి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1994లో వీళ్ల పెళ్లి జరిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ లాగా.. సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా లేరు. 22 ఏళ్ల తర్వాత ఆమె ఐఆర్‌ఎస్ నుంచి వాలింటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆమె చివరగా ఢిల్లీలోని ఇన్‌కమ్‌టాక్స్ అప్పిల్లేట్ ట్రైబ్యూనల్ (ITAT)లో ఐటీ కమిషనర్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే గృహిణిగా స్థిరపడిపోయారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ 1985లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మేకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశం పొందారు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యి ఐఆర్‌ఎస్‌లో చేరారు. చివరగా ఢిల్లీలోని ఇన్‌కమ్‌టాక్స్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. చివరికి 2006 తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
కేజ్రీవాల్ కుటుంబం
అరవింద్ కేజ్రీవాల్ నాన్న పేరు గోవింద్ రామ్ కేజ్రీవాల్. తల్లి గీతా దేవి. అరవింద్ కేజ్రీవాల్, సునితా దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు పుల్కిత్, కూతురు పేరు హర్షిక. కేజ్రీవాల్ పిల్లలు కూడా ఆయనలాగే ఐఐటీలో చదివారు. 2014లో హర్షిక.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 3,322 ర్యాంక్ సాధించింది. ఆ తర్వతా ఐఐటీ ఢిల్లీలో చేరింది. 2019లో పుల్కిత్ సీబీఎస్సీ 12వ తరగతి బోర్ట్ ఎగ్జామ్‌లో 96.4 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఇతడు కూడా ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం పొందాడు.