Delhi Air Pollution: రోజురోజుకీ ఢిల్లీలో వాయ కాలుష్యం ఎక్కువైపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు పడిపోతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణమే ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించాలని ఆలోచిస్తోంది. దీనికోసం ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Shri Gopal Rai), ఆర్ధిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. కోర్టు దీనికి ఆమోదముద్ర వేస్తే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Also Read:రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు… సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
కృత్రిమ వర్షం కురిపించాలంటే ఆకాశంలో 40శాతం మేఘాలుండాలి. నవంబర్ 21, 22 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. సాధారణంగా కృత్రిమ వర్షం కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి ఉపయోగిస్తారు. రసాయనిక పదార్ధాలను మేఘాలలో ప్రవేశపెట్టడం ద్వారా వర్షాన్ని కురిపిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి.
దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు నిన్న హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. దీని కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కొట్టుకోకూడదని సూచించింది.
Also Read:పొంగులేటి నామినేషన్‌కు పర్మిషన్.. వెంట ఐటీ అధికారులు కూడా..