Government Files Burnt: కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు (APMDC) చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్ట (Karakatta) పై బుధవారం రాత్రి తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఇందులో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా, మరికొన్ని కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ కు చెందిన దస్త్రాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట వద్దకు వచ్చారు. ఈ వాహనం పై గవర్నమెంట్ వెహికల్ అనే స్టిక్కర్ కూడా ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లో ఫైళ్లను కరకట్ట పై తగలపెట్టడం మొదలు పెట్టారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ టీడీపీ నేత ఈ విషయాన్ని గమనించారు. ఫైళ్ల పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ (Sameer Sharma) ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ టీడీపీ నేత వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో పెదపులిపాక టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి వచ్చారు.
వారు రావడం గమనించిన ఇన్నోవాలోని వారు యనమలకుదురు వైపు పారిపోయారు. టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే ఈ ఫైళ్లను తగలపెట్టినట్లు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు వివరించాడు.
Also Read: కుప్పకూలిన నేపాల్ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!