AP Volunteers : అది జులై 9, ప్రాంతం ఏలూరు (Eluru).. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బహిరంగ సభలో తన స్పీచ్‌తో హోరెత్తిస్తున్నారు. నాటి జగన్ ప్రభుత్వంపై మాటలతో విరుచుకుపడుతున్నారు. అలా ప్రసంగం మధ్యలో వాలంటీర్ల వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఏపీ (Andhra Pradesh) లో 30వేల మంది మహిళల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. మహిళల వ్యక్తిగత సమాచారాన్ని సమాజంలోని సంఘ వ్యతిరేక శక్తులకు వాలంటీర్లు పంచుతున్నారని పవన్ కామెంట్ చేయడం అగ్గికి రాజేసింది. సీన్ కట్ చేస్తే కథ మొత్తం మారిపోయింది. నాడు పవన్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసిన వాలంటీర్లు ఇప్పుడు జనసేనని కరుణ కోసం వేడుకుంటున్నారు. తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రాదేయపడుతున్నారు.
కరోనా సమంయంలో వాలంటీర్ల సేవలు..
ప్రజల వద్దకే పాలన థీమ్‌తో వాలంటీర్ల వ్యవస్థను 2019లో అధికారంలోకి రాగానే తీసుకొచ్చారు జగన్ (YS Jagan). దాదాపు 2లక్షల 50వేల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి 50కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిజానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో మొదట్లో ఎలాంటి ఫిర్యాదులు లేవు. కరోనా సమంయంలో వాలంటీర్లు చేసిన సేవలకు అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే తర్వాత కాలంలో ఈ వ్యవస్థ మొత్తం జగన్ టీమ్‌లా వ్యవహరించిందన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీ పనులకు వాలంటీర్లను నాటి వైసీపీ సర్కార్ ఎక్కువగా ఉపయోగించుకుందని టీడీపీ-జనసేన పార్టీలు ఆరోపించాయి.
చంద్రబాబు మెతక వైఖరి..
ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్లపట్ల చంద్రబాబు మెతక వైఖరి పాటించారు. 5 వేల రూపాయల జీతానికి గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని జగన్ టార్గెట్‌గా విమర్శల బాణాలు సంధించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు కూడా. అటు పవన్ మాత్రం వాలంటీర్ల టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాకు ఏపీలో వాలంటీర్లే కారణమని పవన్ చేసిన కామెంట్స్ చిచ్చురేపాయి.
పవన్ వర్సెస్ వాలంటీర్ల ఫైట్..
ఓవైపు పవన్ వర్సెస్ వాలంటీర్ల ఫైట్ కొనసాగుతుండగానే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్ల సేవలు బంద్ అయ్యాయి. ఇదే సమయంలో లక్షకు పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పిస్తూ జగన్‌కు మద్దతు ఇస్తు ఈ రాజీనామాలు సమర్పించారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో వాలంటీర్లకు గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది.
వైసీపీ నేతలే రాజీనామాలు చేయించారని..
వైసీపీ ఓటమి తర్వాత కథ మొత్తం మారిపోయింది. తమను బలవంతంగా వైసీపీ నేతలే రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఏకంగా పోలీస్‌స్టేషన్ గడప తొక్కుతున్నారు. కాకినాడ జిల్లా-పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు వాలంటీర్లు. ముందుగా నాగబాబును కలిసేందుకు ప్రయత్నించిన వాలంటీర్ల ఆయన్ను కలవలేకపోయారు. చాలా సేపు పడిగాపుల తర్వాత పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చారు. తమకు తాముగా రాజీనామాలు చేయలేదని.. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని వేడుకున్నారు.
మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేశామంటూ..
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేశామంటున్నారు వాలంటీర్లు. డిగ్రీలు చేసినా ఉద్యోగంలేక కుటుంబ పోషణకై వాలంటీర్‌గా పనిచేస్తున్నామని.. తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వండని ప్రాధేయపడుతున్నారు. వాలంటీర్ల బాధను పవన్ దృష్టికి తీసుకెళ్తానని జనసేన ఇన్చార్జి శ్రీనివాస్ వారికి చెప్పారు. ఇలా కథ మొత్తం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మారిపోయింది.
Also Read : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్!