AP TET 2024 Syllabus: ఏపీ టెట్ పరీక్షకు సిలబస్ మారబోతుందంటూ ప్రచారమవుతున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. జులైలో నిర్వహించే టెట్ పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లు తెలిపింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని స్పష్టం చేసింది. ఈ మేరుకు నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సిలబస్ ప్రకారమే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు.
విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరా..
ఇదిలా ఉంటే.. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరా తీశారు. దీంతో సిలబస్ లో ఎలాంటి మార్పులు చెయ్యలేదని, ఫిబ్రవరి 2024లో నిర్వహించిన సిలబస్ తో జూలై 2024 పరీక్ష జరగబోతుందని అధికారులు మంత్రికి వివరించారు. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేశారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా టీజీటీ 1781, ఎస్ జీటీ 6371,పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్ 7725, పీజీటీ 286, ప్రిన్సిపాల్ 52, మొత్తం 16,347 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.