ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా మార్చి 1 నుంచి 30 వరకూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఈ మేరకు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 .30 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. అలాగే గతేడాది టెన్త్ ఎగ్జామ్స్ ఆరు పేపర్లతో నిర్వహించగా ఈసారి ఏడు పేపర్ల విధానం అమలు చేయనబోతున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష జరపనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు తేదిల్లో నిర్వహించనుండగా రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు. ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనుండగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు కామన్.