Rushi Konda: ఏపీ విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ మార్క్‌గా మారిన రుషికొండ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 61 ఎకరాల్లో విస్తరించిన ఈ రుషికొండపై చంద్రబాబు హయాంలో నిర్మించిన హరిత రిసార్ట్స్‌ను జగన్ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ స్థలంలోనే పర్యాటకాభివృద్ధి పేరిట జగన్ సర్కార్ రూ.450 కోట్లతో పర్యాటక శాఖ 7 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టింది. కొండ దిగువనే 7 విలాస భవనాలు నిర్మించారు. అయితే జగన్ నిర్ణయంపై ప్రజలనుంచి వ్యతిరేకత వచ్చింది. పర్యావరణానికి విఘాతం కలిగించేలా కట్టడాలున్నాయంటూ విశాఖవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రుషికొండపై జగన్ ప్యాలెస్ కట్టుకున్నారంటూ విపక్షాలు, ప్రజా సంఘాల ఉద్యమాలు చేపట్టాయి.
ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు రుషికొండను పవన్ కల్యాన్ సైతం పరిశీలించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే మరోసారి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలోకి రాగా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశమైంది. రుషికొండపై జగన్ హయాంలో నిర్మించిన పలు భవనాలను చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోదనే అంశం ఉత్కంఠ రేపుతోంది. 2014-19 వరకు అమరావతి నుంచే పాలన సాగించిన చంద్రబాబు.. విశాఖను ఆర్థిక, ఐటీ హబ్ తీర్చిదిద్దుతామన్న మొదటినుంచి చెబుతున్నాడు. దీంతో రుషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలను కూలుస్తారా? లేక వాటిని పర్యాటక ప్రాంతాలుగా వాడుకుంటారా అనేది త్వరలోనే తేలనుంది.