AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!

ఎలాంటి విమర్శలకు తావీయకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలని ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదన్నారు. 2024 ఫిబ్రవరి సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహిస్తామని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు.

AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!
New Update

MINISTER LOKESH : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీ (Mega DSC) ని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీ నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించారు.

2024 సిలబస్ తోనే..
ఈ మేరకు టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి, డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదు ఫిబ్రవరి 2024 లో ఏ సిలబస్ తో అయితే టెట్ నిర్వహించామో అదే సిలబస్ తో జూలై 2024 లో పరీక్ష నిర్వహించబోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదని పాత సిలబస్ తో టెట్ నిర్వహణ అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో నిజం లేదని అధికారులు తెలిపారు.

దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని..
మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు పలువిభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లా (Prakasam District) లో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. స్కూళ్ల మూసివేతకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ. 117 వలన ఎటువంటి నష్టం కలిగిందన్న విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపు అంశాలను అధికారులు మంత్రి దృష్టికి తేగా, దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టుల భర్తీపై త్వరలో నిర్ణయం..
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 1633 మంది బోధన సిబ్బంది డిమాండ్స్ పై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వమని అధికారులను లోకేష్ కోరారు.

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నభోజనం..
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు లోకేష్ సూచించారు. మెనూ ఎలా ఉండాలనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల రెన్యువల్ విషయంలో అనవసరమైన ఆంక్షలు విధించవద్దని, ప్రైవేటు, ప్రభుత్వరంగాల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే అంతిమంగా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రణాళికబద్దమైన అకడమిక్ క్యాలండర్ (Academic Calendar) రూపొందించి, నిర్ణీత సమయానికి పరీక్షల నిర్వహణతోపాటు విద్యార్థులను వివిధరకాల క్రీడల్లో కూడా ప్రోత్సహం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్, కమిషనర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అది నా బాధ్యత సీఎం గారూ!

#prakasam-district #minister-lokesh #ap-mega-dsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe