Prashant Kishor Interview On AP Elections 2024: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేసేది నాయకుడిని ఎన్నుకోవడానికి.. రాజును ఎన్నుకోవడానికి కాదు అని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆర్టీవీ స్థూడియోలో రవిప్రకాష్ తో ఆయన ప్రస్తుత ఏపీ రాజకీయాలు.. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనే అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ఎన్నికల్లో వైసీపీకి (YCP) భారీ ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, వైసీపీ ఓడిపోవచ్చు అని చెప్పడానికి చాలా కారణాలను ఆయన వివరించారు. ప్రశాంత్ కిషోర్ వైసీపీ గురించి.. సీఎం జగన్ (CM Jagan) గురించి రవిప్రకాష్ తో ఏమి చెప్పారో వివరంగా తెలుసుకుందాం.
రేపు జరగబోతున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందా? ఎన్ని సీట్లు వైసీపీకి రావచ్చు? అన్న రవిప్రకాష్ (Ravi Prakash) ప్రశ్నకు సమాధానంగా ప్రశాంత్ కిషోర్ 51 స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉంది . ఈ ఎన్నికల్లో జగన్ భారీ ఓటమి చెందబోతున్నారు అని చెప్పారు. దానికి కారణాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్ ఒక్క తప్పు కాదు సిరీస్ ఆఫ్ బ్లండర్స్ చేశారు. జగన్ సీఎం అయ్యాకా పూర్తిగా సంక్షేమ పథకాలపై ఆధార పడ్డారు. ప్రజలకు డబ్బులు పంచిపెడితే చాలు.. అధికారంలో కొనసాగుతూనే ఉంటాను అనే ఒక్క ఆలోచనతోనే జగన్ ఉండిపోయారు. డబ్బులు పంచితే చాలు.. ప్రజలకు ఉద్యోగాలు, రోడ్లు, వారి ఆర్ధిక స్థితి ఇవి ఏమైనా ఫర్వాలేదు అని ఆయన అనుకున్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కలవనవసరం లేదు. ముఖ్యమంత్రికి ప్రజలను కలిసే పని లేదు అని భావించినట్టుందని చెప్పారు ప్రశాంత్ కిషోర్.
వైసీపీ ఓటమి తప్పదు అని తాను ఎందుకు అనుకుంటున్నారో ప్రశాంత్ కిషోర్ చెప్పిన మరిన్ని వివరాలు సంక్షిప్తంగా ఇవే..
- హామీలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనిని జగన్ చేయలేకపోయారు. ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేశారు జగన్. దానికి భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు.
- 2019 ఎన్నికల్లో జగన్ చెల్లి షర్మిల (YS Sharmila) అవిశ్రాంతంగా వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డారు. అధికారంలోకి రాగానే ఆమెను, ఆమెతో పాటు తల్లిని కూడా పక్కన పెట్టేశారు. తల్లిని, చెల్లిని అందులోనూ తన విజయం కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం ఆయన పై విశ్వసనీయతను దూరం చేసింది
- నేను ఆ ఎన్నికల్లో నవ రత్నాలు పథకాలను డిజైన్ చేసి వాటిని కచ్చితంగా అమలు చేయాలని చెప్పాను. ఆ పథకాలు కూడా వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం. అయితే, అవి ఒక్కటే సరిపోవు.. అభివృద్ధి కూడా కావాలి. దానిని జగన్ పట్టించుకోలేదు.
- వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలను అందులో చొప్పించారు. దీంతో స్థానిక సంస్థల మనుగడ ప్రమాదంలో పడింది. మన వ్యవస్థలో పంచాయతీ సర్పంచ్, విలేజ్ హెడ్ వంటి వారిని నిర్వీర్యం చేశారు.
- ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారు
బొత్స వ్యాఖ్యలపై..
మిమ్మల్ని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డబ్బు ఎవరిస్తే వారి మాట మాట్లాడతారు అని అంటున్నారు దానికి ఏమి చెబుతారు అని రవిప్రకాష్ ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా బాగా సంపాదించారేమో.. అందులో కొంత నాకివ్వలేకపోయారా? ఆయనకు కూడా నేను పనిచేసేవాడిని.. అని చెప్పారు. అంతేకాకుండా, బొత్స ఎవరు అసలు. వైసీపీలో ఒక భాగం. ఆయన నా గురించి మాట్లాడాల్సిన పనేమి వచ్చింది. నాకు కొంత సమాచారం ఉంది.. బొత్స భార్య విశాఖ నుంచి పోటీలో ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు అని నేను చెబుతాను నిజం అయిపోతుందా? అని ప్రశ్నించారు.
Also Read: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ సంచలన ఇంటర్వ్యూ
టీడీపీ కోసం పని చేశారని అంటున్నారు..
ప్రశాంత్ కిషోర్ - తెలుగుదేశం మధ్య సంబంధాలపై అందరూ మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని రవిప్రకాష్ చెప్పగా.. తాను 2019 తరువాత ఐ పాక్ వదిలేసానని చెప్పారు. తాను ఇప్పుడు స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం లేదనీ.. గతంలోనే చెప్పినట్టు ఒక మిత్రుడి ద్వారా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగిందనీ చెప్పారు. అయితే, మీరు చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదా? అన్న రవిప్రకాష్ ప్రశ్నకు నేను మిమ్మల్ని కలిసినా.. జగన్ ని కలిసినా.. మోదీని కలిసినా.. ఆఖరుకు రాహుల్ ను కలిసినా రాజకీయాలే ప్రస్తావనకు వస్తాయన్నారు. అంత మాత్రం చేత మీకూ నాకూ ఎదో సంబంధము ఉందంటే ఎలా? అని ప్రశ్నించారు.
కృతజ్ఞత లేనివారు..
చివరగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. “వైసీపీకి కనీస పద్ధతి లేదన్నారు. 2019లో అంతటి విజయాన్ని తీసుకువచ్చిన తరువాత.. నేను బయటకు వెళ్లిపోయాకా.. బొత్స లాంటి నాయకులు నాగురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరైనదేనా? అని ప్రశ్నించారు. కనీస కృతజ్ఞత లేని వారు ఎప్పటికీ నిలబడలేరు. ఇక సంక్షేమ పథకాల గురించి ఒక మాట చెబుతాను.. ప్రధాని మోదీ కూడా 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు. అలా అని ఆయనను వ్యతిరేకించేవారు ఉండరా? అయినా సంక్షేమ పథకాలకు డబ్బు వాళ్ళ ఇంటి నుంచి తెస్తున్నారా? మన దేశంలో సంక్షేమ పథకాల పేరుతో ఒక పార్టీకి అధికారాన్ని అప్పచెప్పిన మొదటి రాష్ట్రం ఏపీ. ఆ కృతజ్ఞత కూడా ప్రజలపై వారికి లేదు” అంటూ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు.
ప్రశాంత్ కిషోర్ పూర్తి ఇంటర్వ్యూ వీడియో ఇక్కడ చూడొచ్చు..